JSON Variables

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం పర్యటన

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం పర్యటన
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

- వసతులను పరిశీలించిన ప్రత్యేక కమిటీ
- విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
- ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమాలోచన
- నేడు కూడా కొనసాగనున్న పర్యటన

*బెల్లంపల్లి:* బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం న్యాక్ బృందం పర్యటించింది. నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) సభ్యులు ముగ్గురు చైర్పర్సన్ డాక్టర్ మురళీధర్ చందేకర్, మెంబర్ కో ఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ యూసుఫ్ పీర్జదా, సభ్యులు డాక్టర్ ఎన్. మహదేవ్ స్వామి గురువారం ఉదయమే కళాశాలకు చేరుకున్నారు. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గోపాల్ 33 సంవత్సరాల చరిత్ర కలిగిన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి వారికి క్లుప్తంగా వివరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సంఖ్య పరంగా, ఫలితాల పరంగా ఎలా అభివృద్ధి దిశగా సాగుతుందో తెలియజేశారు. అలాగే కళాశాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కళాశాలలోని అన్ని డిపార్ట్మెంట్ లను పరిశీలించారు. ఆయా డిపార్టుమెంటుల రికార్డులను పరిశీలించారు. డిపార్ట్మెంట్ల వారీగా అధ్యాపకులు విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు.
విభాగాల వారీగా సమావేశాలు
మధ్యాహ్న భోజనం అనంతరం న్యాక్ బృంద సభ్యులు విభాగాల వారీగా సమావేశమయ్యారు. ముందుగా విద్యార్థులతో ఇంటరాక్ట్  ప్రోగ్రాం నిర్వహించారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాల లో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. పిల్లలకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందిస్తున్న చదువు పట్ల వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలో చదివి వివిధ స్థానాల్లో ఉద్యోగాల్లో ఉన్న పూర్వ విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఇక్కడి కళాశాలలో చదివి వారు ఏయే స్థానాల్లో ఉన్నారో తెలుసుకున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
న్యాక్ బృంద సమావేశాల అనంతరం సాయంత్రం కళాశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతరం విద్యార్థులు వివిధ జానపద, సాంస్కృతిక పాటలపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు విద్యార్థులను, ఆహూతులను ఆకట్టుకున్నాయి.
హాజరైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
న్యాక్ బృంద పర్యటన సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం మధ్యాహ్నం కళాశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బృంద సభ్యులతో సమావేశమయ్యారు. కళాశాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని వివరించారు. సభ్యులు సహకరించి కళాశాల అభివృద్ధి కోసం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బృంద సభ్యులతో మాట్లాడుతూ, 33 సంవత్సరాల చరిత్ర కలిగిన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకు వెళ్లారు. కళాశాలకు బాలుర, బాలికల వసతి గృహాలు, అదనపు తరగతి గదులు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా న్యాక్ సభ్యులకు తెలియజేశారు.
పరిశీలించిన జెడి
న్యాక్  బృందం పర్యటన సందర్భంగా కమీషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి గారు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాక్ బృంద సభ్యులు మరియు ప్రిన్సిపాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, న్యాక్ బృందంతో జె.డి యాదగిరి సమావేశమయ్యారు. కళాశాల అభివృద్ధి కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు.
నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
న్యాక్ బృందం పర్యటనలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం కార్యక్రమాలను విద్యార్థులు, అధ్యాపకులు విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ గోపాల్ పిలుపునిచ్చారు. మొదటి రోజు కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా కొనసాగాయని తెలిపారు. బృంద సభ్యులు అడిగిన అన్నిటికీ తాము సమాధానాలు తెలియజేశామని వివరించారు. సహకరించిన అధ్యాపకులకు, విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు, బోధనేతర సిబ్బందికి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ జె.వి.ఆర్ అర్చన, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ ప్రవీణ్ కుమార్, ఐటీ సెక్టార్ ఇంచార్జి నవీన్ కుమార్, సి పి డి సి ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సభ్యులు అజయ్ లోయ పింటూ, కొడిప్యాక శ్రీనివాస్ (దత్తాత్రేయ ట్రేడర్స్), కొడిప్యాక సాయినాథ్, పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున కాంపల్లి శంకర్, వల్లాల రజినీకాంత్, మేడ తిరుపతి, డాక్టర్ కంబాల మురళీకృష్ణ, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments